Tag Archives: తెలంగాణ

నీళ్ళలో నిప్పులు రగిలించినవాడు “రామరాజు విద్యాసాగర్ రావు”


రామరాజు విద్యాసాగర్ రావు తెలంగాణలో ఆచార్య జయశంకర్ గారితో కలిసి పనిచేసిన ఉద్యమ శిఖరం. విద్యాసాగర్ రావు గారు వేదిక మీద ఉంటె ఆయన్ని సంబోదిస్తూ కె సి ఆర్ గారు అనే మాటలు ‘ నీళ్లలో నిప్పులు రగిలించిన వాడు ‘. ఇది అక్షర సత్యం. విద్యాసాగర్ రావు కేంద్ర ప్రభుత్వం నుంచి 1997 లో చీఫ్ ఇంజనీర్ గా పదవీ విరమణ పొందిన తర్వాత దిల్లీ నుంచి తన మకాంని హైదరాబాద్ కు మార్చినాడు. అప్పటికీ తెలంగాణా ఉద్యమం ఇంకా ఊపందుకోలేదు. కొన్ని ఉద్యమ సంస్థలు పని చేస్తున్న సందర్భం అది. ఆనాటికి సాగునీటి రంగంలో తెలంగాణాకు జరుగుతున్న అన్యాయాలని , వివక్షని ఎండగడుతూ రాస్తూ , మాట్లాడుతూ భావప్రచారం చేస్తున్న వాళ్ళలో ప్రముఖులు ఇద్దరే. ఒకరు ఆచార్య జయశంకర్ , మరొకరు వి. ప్రకాష్. దిల్లీలో ఉన్నప్పుడు విద్యాసాగర్ రావు గారికి ఈ సంగతులు ఎం పి ల ద్వారా లీలామాత్రంగా తెలిసేవి . ముఖ్యంగా ఆ రోజుల్లో లోక్ సభ సభ్యుడిగా కరీంనగర్ కు ప్రాతినిధ్యం వహించే జె చొక్కారావు గారి ద్వారా తెలిసేవని ఆయనే నీళ్ళు – నిజాలు మొదటి సంపుటానికి ముందు మాటలో రాసుకున్నారు. అప్పుడు తనకున్న పరిమితుల దృష్ట్యా వాటిని విని తెలుసుకోవడం తప్ప ఏమైనా చేయగలమన్న దానిపై ఆయనకు స్పష్టత లేదు. చొక్కారావు గారికి తనకు చేతనైన సహాయం చేసి పంపించేవారు. పదవీ విరమణ తర్వాత దిల్లీలో ఉండి తనకు ఇష్టమైన నాటకాలు , సాంస్క్రతిక కార్యక్రమాలు, రేడియో కార్యక్రమాలు నిర్వహిస్తూ కాలం గడపడమా లేక హైదరాబాద్ వెళ్లి మరేదైనా వ్యాపకంలో తన కాలాన్ని సద్వినియోగం చేయడమా అన్న మీమాంస కొంత కాలం అతన్ని వేదించింది. చివరికి హైదరాబాద్ నే ఎంచుకున్నారు. ఆ నిర్ణయం చరిత్రాత్మకమైన నిర్ణయంగా ఆనాడు ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు. తెలంగాణా అతనికి అద్భతమైన , అనితరసాధ్యమైన చారిత్రాత్మక పాత్ర పోషించడానికి అవకాశాన్నిచ్చిందని చెప్పడానికి ఇప్పుడు నేను సాహసిస్తున్నాను.

జల విజ్ఞానం నీళ్ళు – నిజాలు :
ఆరోజుల్లో వార్త దినపత్రిక సంపాదకుడిగా పని చేస్తున్న శ్రీ కె రామచంద్రమూర్తి గారు విద్యాసాగర్ రావు గారికి నీటి సంగతులు రాయడానికి అవకాశాన్నివ్వడం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ అవకాశాన్ని విద్యాసాగర్ రావుగారు గొప్పగా వినియోగించుకున్నారు. మొదటి దశలో నీటికి సంబంధించి జనరల్ విషయాలను రాసినాడు. దిల్లీలో ఉన్నప్పుడు నాటకాలు , రేడియో కార్యక్రమాలకు అనేక వందల తెలుగు స్క్రిప్టులని రాసిన అనుభవం ఉన్నవాడు కనుక మంచి వచనం రాయడం అతనికి కొట్టిన పిండి. వార్త దినపత్రికలో ఆయన వ్యాసాలకు పాటకుల నుంచి మంచి ఆదరణ లభించింది. సంపాదకుల వారు జనరల్ విషయాలపై నుంచి తెలంగాణా ప్రాజెక్టుల స్థితిగతుల పైకి చర్చను మళ్ళించమని విద్యాసాగర్ రావు గారిని కోరినారు. ఆయన తెలంగాణా ప్రాజెక్టుల స్తితిగతుల గురించి తెలుసుకోవడానికి సాగునీటి శాఖలో పనిచేస్తున్న ఇంజనీర్లపై ఆధారపడవల్సి వచ్చింది. అట్లా ఆయన ఒకసారి జలసౌదకు వచ్చినప్పుడు నాకు ఆయనతో పరిచయ భాగ్యం కలిగింది. అప్పటికే వార్తలో ఆయన వ్యాసాలను చదివి ఉన్నాను కనుక పరిచయం త్వరలోనే స్నేహంగా మారింది. వయసులో నాకన్నా చాలా పెద్దవారు. నిరాడంబర జీవన శైలి వలన వయసు, హోదా స్నేహం బలపడటానికి అడ్డు కాలేదు. పైగా జలసౌధలో అతనికి సమాచారం అందించగలిగే అతి కొద్దిమందిలో నేనొకడిని .

ఆయన తెలంగాణ ప్రాజెక్టులపై రాయడం మొదలుపెట్టే నాటికి తెలంగాణా చైతన్యం కొద్దిగా ఊపందుకున్నది. 1996 లో తెలంగాణ ఉద్యమం పునరుజ్జీవనం పొందిన తెలంగాణ ఉద్యమం తొలి రోజుల్లో బుద్ధిజీవులు చేపట్టిన భావ ప్రచారం విస్తృతం అయ్యింది. సభలు , సమావేశాలు , సదస్సులు , కరపత్రాలు , పుస్తకాల ప్రచురణ , సాంస్కృతిక దళాల నిర్మాణం జరిగినందున 2001 నాటికి తెలంగాణ సాధన కోసమే ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు కావడానికి ఒక నేపథ్యం ఏర్పడింది. టి‌ఆర్‌ఎస్ ఆవిర్భావం తర్వాత తెలంగాణ ఉద్యమం గుణాత్మకమైన మలుపు తీసుకున్నది. అప్పటి దాకా రాజ్యం అమలు చేసిన తీవ్ర నిర్బందానికి గురి అయి తెలంగాణలో ప్రజా సంఘాలు పని చేయలేని పరిస్థితిలో టి‌ఆర్‌ఎస్ ఆవిర్భావంతో తెలంగాణ ఉద్యమ రాజకీయ కార్యకలాపాలకు ఒక ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడింది. తెలంగాణా రాజ్యాంగ బద్దంగా , పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి సాధించుకోవాల్సిన సమస్య కాబట్టి తెలంగాణా సాధనకు కొత్త ప్రజాసంఘాల ఏర్పాటు అనివార్యమని తెలంగాణా మేధావులు గుర్తించినారు. టి ఆర్ ఎస్ ఏర్పాటుతో కొత్త తెలంగాణ ప్రజా సంఘాల ఏర్పాటుకు వెసులుబాటు ఏర్పడింది. 2001 తర్వాత అట్లా ఏర్పడిన తొలి ప్రజా సంఘాల్లో తెలంగాణ రచయితల వేదిక , తెలంగాణ సాంస్కృతిక వేదిక , తెలంగాణ ఉద్యోగుల సంఘం , తెలంగాణ విద్యావంతుల వేదిక , తెలంగాణ ఐక్య వేదిక , తెలంగాణ జర్నలిస్టుల ఫోరం చెప్పుకోదగ్గవి. రచయితల వేదిక , సాంస్కృతిక వేదిక లు సాంస్కృతిక రంగంలో , తెలంగాణ ఉద్యోగుల సంఘం ఉద్యోగ రంగంలో, తెలంగాణ విద్యావంతుల వేదిక , తెలంగాణ ఇక్య వేదిక మరింత విస్తృతంగా తెలంగాణ రాజకీయ , సామాజికంశాల్లో తమ కృషిని కొనసాగించినాయి. పత్రికల్లో పనిచేస్తున్న తెలంగాణ జర్నలిస్టులు యాజమాన్యాల తరపు నుంచి ఎన్ని ఆంక్షలు , పరిమితులు ఎన్ని ఉన్నా తెలంగాణ ఉద్యమ వార్తలను ప్రచురించినారు. ఎడిటర్లుగా ఉన్నవారు సాధ్యమైనంత మేరకు తెలంగాణ వార్తలకు , వ్యాసాలకు చోటు కల్పించినారు. మేధావులు , కవులు , రచయితలు , కళాకారులు విస్తృతంగా రాస్తున్న కాలం అది.

ఈ ఉద్యమ వాతావరణంలో విద్యాసాగర్ రావు కలం కూడా పదునెక్కింది. వార్తలో తెలంగాణా ప్రాజెక్టులపై ఆయన రాస్తున్న వ్యాసాలు విస్తృత ప్రజాదరణ పొందినాయి. వార్తతో పాటు వివిధ పత్రికలవారు తమకు కూడా వ్యాసాలూ రాయమని అడగడంతో ఆయన రచనా వ్యాసంగం పరిధి పెరిగింది. రాజకీయ పార్టీల నాయకులు సాగునీటి రంగం పై ఆయనని సంప్రదించడం మొదలయ్యింది. ప్రజా సంఘాలు వారి సభల్లో సాగునీటి రంగం పై ఉపన్యాసాలకు ఆహ్వానించడం ప్రారంభమయ్యింది. 2004 ఎన్నికల నాటికి తెలంగాణా ఆకాంక్ష ప్రభలమైన రాజకీయ డిమాండ్ గా మారింది. కె సి ఆర్ నాయకత్వంలో తెలంగాణా రాష్ట్ర సమితి ఈ రాజకీయ డిమాండ్ ని పార్లమెంటులో వినిపించడానికి సన్నాహాలు చేస్తున్నది. టి ఆర్ ఎస్ తెలంగాణ ఆకాంక్షని వెల్లడించే బలమైన ఉద్యమ వేదికగా రూపుదాల్చింది. సహజంగానే విద్యాసాగర్ రావు గారు కె సి ఆర్ కు సన్నిహితులుగా మారినారు. ఆచార్య జయశంకర్ ఒకవైపు , విద్యాసాగర్ రావు మరొక వైపు నిలబడి కె సి ఆర్ కు ఉద్యమ ప్రస్థానంలో సైదాంతిక , మేధోపరమైన సహకారాన్ని అందించినారు. విద్యాసాగర్ రావు సాగునీటి రంగ సమస్యలపై సాధికారంగా రాయడం ప్రారంభించిన తర్వాత ఇక ఆ అంశంపై తనకు మాట్లాడే అవసరం , రాసే అవసరం తీరిపోయిందని ఆచార్య జయశంకర్ గారు అనేక సందర్భాల్లో అనేవారు. అది నిజం. విద్యాసాగర్ రావు బలమైన తెలంగాణా గొంతుతో రాస్తున్న, మాట్లాడుతున్న కాలంలో జయశంకర్ సారు సాగునీటి అంశాలపై తక్కువగానే మాట్లాడేవారు.

ఉపన్యాస కళ :
ఆయన పరిచయమైనాక ఒకసారి ఒక ఉపాధ్యాయుల సంఘం వారు మిర్యాలగూడలో ఒక సభకు నన్ను , విద్యాసాగర్ రావుని ఆహ్వానించినారు. ఆ సభలో నేనేం మాట్లాడినానో నాకు గుర్తులేదిప్పుడు. అయితే విద్యాసాగర్ రావు గారి ప్రసంగం నన్ను ఆయనకు కట్టి పడేసింది. జటిలమైన సాంకేతిక అంశాలను సులభ శైలిలో అందరికీ అర్థం అయ్యే భాషలో ఆయన వివరించే తీరు చూసి సంబ్రమానికి లోనయినాను. ఇదెట్లా అబ్బిందని ఇప్పుడు ఆలోచిస్తే నాటక ప్రయోక్తగా , రేడియో కార్యక్రమాలని నిర్వహించిన అనుభవం వల్లనే ఆయనకు ఈ ఉపన్యాస కళ అలవడిందని అర్థం అయ్యింది. ఆ తర్వాత విద్యాసాగర్ రావును తెలంగాణా అంతటా తిప్పినాను. ఎక్కడకి రమ్మంటే అక్కడికి వచ్చి ప్రసంగాలు చేసేవారు. తెలంగాణా ఉద్యోగుల సంఘం , తెలంగాణా రచయితల వేదిక , 2004 ఎన్నికలకు ముందు ఏర్పాటు అయిన తెలంగాణా విద్యావంతుల వేదిక ఏర్పాటు చేసిన అనేక సభల్లో జయశంకర్ గారితో వేదిక పంచుకున్నారు. అనేక సార్లు ఆయన్ని సభలకు తోలుకపోయి తిరిగి ఇంట్లో దింపే పని నేనే చేసేవాడిని. వివిధ సంఘాల వారికి ఆయనతో సభలకు డేట్లు కన్ ఫర్మ్ చేసి పెట్టేవాడిని. నేను అడిగితె కాదనేవాడు కాదు ఆయన. 2002 ఏప్రిల్ నెలలో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆదిలాబాద్ జిల్లా శాఖ చేపట్టిన జలసాధన యాత్రలో మూడు రోజులు యాత్రలో పాల్గొని అనేక సభల్లో ప్రసంగించినాడు. బాసర నుంచి ప్రారంభమైన యాత్ర ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ముగిసింది. ఆ వయసులో ఎర్రటి ఎండలో ఆయన మాతో యాత్రలో పాల్గొన్న తీరు , సాగునీటి కల్పనలో ఆయన కమిట్ మెంట్ మాకు ఆశ్చర్యం కలిగించింది.

జలయజ్ఞం కుట్ర బద్దలు :
2004 ఎన్నికల అనంతరం ఉద్యమానికి గుణాత్మకమైన ఊపు వచ్చింది. తెలంగాణా డిమాండ్ పార్లమెంట్ కు చేరింది. యు పి ఎ తన ఎజెండాలో తెలంగాణా ఏర్పాటును చేర్చింది. రాష్ట్రపతి చేత మొదటి ప్రసంగంలో తెలంగాణా ఏర్పాటును ప్రకటింపజేసింది. ఇక తెలంగాణా ఏర్పాటు దగ్గరికి వచ్చిందని అర్థం అయ్యింది. తెలంగాణా సమాజంలో గొప్ప కదలిక ప్రారంభమయ్యింది. అయితే తెలంగాణా వ్యతిరేకి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా తెలంగాణా ఏర్పాటు ప్రక్రియను ముందుకు సాగకుండా చక్రం తిప్పసాగినాడు. తెలంగాణా ప్రజానీకాన్ని ఉద్యమ బాట నుంచి తప్పించడానికి ప్రణాళికలు సిద్దం చేసుకున్నాడు. ఉద్యమానికి ప్రధాన ప్రాతిపదిక సాగునీరు. దానికి విరుగుడుగా జలయజ్ఞాన్ని తీసుకవచ్చినాడు రాజశేఖర్ రెడ్డి. జలయజ్ఞం తాత్విక పునాది ఏమిటంటే కృష్ణా నీళ్ళని పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు తరలించడం , తెలంగాణా ప్రజానీకాన్ని ఉద్యమం నుంచి దూరం చెయ్యడం. 2005 లో జలయజ్ఞం పెద్ద ఎత్తున ప్రారంభం అయ్యింది. విద్యాసాగర్ రావు గారు తొలి రచనల్లో సాగునీటి రంగంలో తెలంగాణాకు అన్యాయాలు , వివక్షలు , ప్రాజెక్టుల స్థితిగతులపై విస్తృతంగా రాసినారు. వాటిని నీళ్ళు – నిజాలు పేరు మీద పుస్తకం వేయాలని సంకల్పించినారు. ఆ పనికి నన్నే ఎన్నుకున్నారు విద్యాసాగర్ రావు. 2005 వరకు ఆయన రాసిన వందలాది వ్యాసాల నుంచి కొన్నింటిని ఎంపిక చేసి ఆ పుస్తకాన్ని విద్యావంతుల వేదిక , తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం తరపున సంయుక్త ప్రచురణగా వేలువరించినాము. 2006 లో ఆ పుస్తకం వెలువడింది. కొన్ని నెలల్లోనే పుస్తకాలు అన్నీ అమ్ముడుపోయినాయి. ప్రజల నుండి డిమాండ్ ఉండడంతో 2008 రెండో ముద్రణ కూడా వేసినాము.

ఈ పుస్తకం తర్వాత రెండో భాగం వేయాల్సిన అవసరం ఉంటుందని ఆయన కూడా అనుకోలేదు. అయితే 2005 జలయజ్ఞం ప్రారంభం అయినాకా రెండేండ్లు గడచినాయో లేదో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం యలయగ్నాన్ని అమలుచేస్తున్న తీరుతెన్నుల్ని , తీసుకుంటున్న నిర్ణయాలను నిశితంగా పరిశీలించిన విద్యాసాగర్ రావు గారు తన పని అయిపోలేదని జలయజ్ఞాన్ని విశ్లేషించక తప్పదనుకున్నాడు. రెండో దశ రచనలన్నీ జలయజ్ఞాన్ని నిశితంగా విశ్లేశించినవే కావడం మనం గమనించాలి. జలయజ్ఞం తాత్విక భూమికను ఎరుక పరచడంలో ఆయన చూపించిన నైపుణ్యం అనితరసాధ్యం. ప్రభుత్వంలో ఉన్న నాలాంటి ఇంజనీర్లు అందరికీ కనువిప్పు కలిగించే విధంగా ఆయన రచనలు సాగినాయి. కృష్ణా నీళ్ళని శ్రీశైలం జలాశయం ద్వారా పోతిరెడ్డి పాడు హెడ్ రేగ్యులెటర్ ద్వారా సుమారు 250 టి ఎం సి ల నీటిని తరలించడానికి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న మొదటి నిర్ణయం శ్రీశైలం జలాశయం కనీస నీటి మట్టాన్ని 834 అడుగుల నుంచి 854 అడుగులకు పెంచడం. 11 వేల క్యూసెక్కుల నీటిని తరలించే సామర్థ్యం కలిగిన పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ వద్ద అదనంగా 44 వేల క్యుసేక్కులను తరలించుకపోవడానికి తూములని నిర్మించడానికి చర్యలు చేపట్టడం. అంటే పాతవి కొత్తవి కలిపి పోతిరెడ్డి పాడు నుంచి మొత్తం 55 వేల క్యుసేక్కులని తరలించే ఏర్పాట్లు గుట్టుచప్పుడు కాకుండా జరిగిపొయినాయి. రాయలసీమలో 250 టి ఎం సి ల నిల్వ సామర్థ్యం కలిగిన జలాశాయాలని నిర్మించడం. శ్రీశైలం నుంచి తరలించుకపోయే 250 టి ఎం సి ల కృష్ణా నీటి లోటుని ఆంద్ర ప్రాంతానికి సమకూర్చడానికి గోదావరిపై రెండు ప్రాజెక్టులని రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం చేపట్టింది. ఒకటి పోలవరం , రెండోది దుమ్ముగూడెం నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ లింక్ పథకం. ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా , కోర్టు కేసులు ఉన్నా , పక్క రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయినా , లక్షలాదిగా నిర్వాసితులవుతున్న ఆదివాసీల నుంచి ఉద్యమాలు వస్తున్నా కూడా మొండిగా పోలవరం నిర్మాణానికి సంకల్పించినాడు. కోర్టు కేసుల వలన పోలవరం డ్యాం నిర్మాణం సాధ్యం కాకపోయినా కాలువలను తవ్వించినాడు. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పోలవరం కుడికాలువ ద్వారా 80 టి ఎం సి నీటిని కృష్ణా డెల్టాకు తరలించే వెసులుబాటు ఉన్నది. 165 టి ఎం సి ల గోదావరి నీటిని దుమ్ముగూడెం వద్ద ఎత్తిపోసి నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ కు తరలించి రివర్సిబుల్ పంపుల ద్వారా నాగార్జున సాగర్ కు ఎత్తిపోసి కుడి కాలువ ద్వారా నాగార్జునసాగర్ ఆయకట్టుకు నీరివ్వడానికి డి పి ఆర్ లు లేకుండానే టెండర్లు పిలిచినారు. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా ఆంద్ర ప్రాంతానికి 225 టి ఎం సి ల నీరు సమకూరుతుందని ఆంద్ర ప్రాంత నాయకత్వాన్ని నోరెత్తకుండా చల్లబర్చినాడు. ఈ క్రమంలో తెలంగాణకు కూడా న్యాయం చేస్తున్నానని నమ్మబలకదానికి ప్రాణహిత చేవెళ్ళ పథకాన్ని ప్రారంభించినాడు. అప్పటికే ప్రారంభమైన మరికొన్ని భారీ మధ్యతరహా ప్రాజెక్టులని జలయజ్ఞంలో చేర్చి తెలంగాణా నాయకత్వాన్ని నోరెత్తకుండా చేయగలిగినాడు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రల్ని సమర్థవంతంగా , నైపుణ్యంతో , పదునైన విశ్లేషణతో బహిర్గతం చేసినవాడు విద్యాసాగర్ రావు ఒక్కడే. ఈ కుట్రలను అర్థం చేసుకొని రాజశేఖర్ రెడ్డిని ప్రశ్నించిన తెలంగాణా కాంగ్రెస్ నాయకుడు పి. జనార్ధన్ రెడ్డి ఒక్కడే. 2009 ఎన్నికల నాటికి రాయలసీమ ప్రాజెక్టులు , పోతిరెడ్డిపాడు తూముల నిర్మాణం , పోలవరం కుడికాలువ నిర్మాణం పూర్తి అయినాయి. తెలంగాణా ప్రాజెక్టులు మాత్రం భూసేకరణ జరుగక , అటవీ అనుమతులు లేక , అంతర రాష్ట్ర వివాదాలు పరిష్కారం కాక దేకుతూనే ఉన్నాయి. మరొవైపు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణా ఏర్పాటును అనేక కారణాలు చెబుతూ వాయిదా వేస్తూనే ఉన్నది. అసంతృప్తి గురి అయిన తెలంగాణా సమాజం ఎ విధంగా ఉద్యమ బాటలో నడచి తెలంగాణ సాధించుకున్నదో అందరికీ తెలిసిన చరిత్రే.

2012 లో విద్యాసాగర్ రావు రాసిన రెండో దశ వ్యాసాలని నీళ్ళు- నిజాలు -2 గా తెలంగాణా ఇంజనీర్ల జె ఎ సి , తెలంగాణా విశ్రాంత ఇంజనీర్ల ఫోరం సంయుక్తంగా ప్రచురించినాయి. ఈ రెండో సంపుటానికి కూడా ఆయన నాకే సంపాదకత్వ భాద్యతలు ఆప్పగించినారు. ఈ రెండో సంపుటాన్ని కె సి ఆర్ గారు ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఆవిష్కరించి విద్యాసాగర్ రావుని అభినందించినారు. నీళ్ళు – నిజాలు రెండు సంపుటాలను తెలంగాణా సమాజం హృదయపూర్వకంగా ఆదరించినాయి. ఇప్పుడు పోటీ పరీక్షలకు చదువుతున్న విద్యార్తులకు ఈ రెండు సంపుటాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

సాగునీటి సలహాదారుడు :
తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కాగానే కె సి ఆర్ నాయకత్వాన తోలి తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత విద్యాసాగర్ రావు గారి ప్రభుత్వం సాగునీటి సలహాదారుగా నియమించుకున్నది. అది ఆయనకు దక్కిన సహజ న్యాయంగా నేను భావిస్తున్నాను. నేను సాగునీటి శాఖకు మంత్రిగా నియమితులైన శ్రీ హరీష్ రావు గారి వద్ద ఓ ఎస్ డి గా పనిచేయడానికి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడంతో విద్యాసాగర్ రావు గారితో మరింత సన్నిహితంగా పనిచేయడానికి అవకాశం చిక్కింది. తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న తక్షణ నిర్ణయాల్లో కుట్ర పూరిత ప్రాజెక్టు అయిన దుమ్ముగూడెం నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టుని రద్దు చెయ్యడం, ప్రాణహిత – చేవెళ్ళ , దేవాదుల ప్రాజెక్టులని కూలంకషంగా మదించి ఉత్తర తెలంగాణా అవసరాలకు అనుగుణంగా రీ ఇంజనీరింగ్ ప్రక్రియను చేపట్టడం, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చి అటకకెక్కించిన పాలమూరు-రంగారెడ్డి , డిండీ ఎత్తిపోతల పథకాలని సమీక్షించి తెలంగాణా అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకొని ప్రాజెక్టులని చేపట్టడం, ఉమ్మడి ప్రభుత్వ హయాంలో విద్వంసమైన గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను పునరుద్దరించికోవడం కోసం మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ప్రారంభించడం, కృష్ణా , గోదావరి జలాల్లో న్యాయమైన వాటా దక్కించుకోవడానికి కేంద్ర ప్రభుత్వ వివిధ వేదికలపై పోరాటాన్నికొనసాగించడం. ఈ అన్ని అంశాల్లో ముఖ్యమంత్రి కె సి ఆర్ తో కలిసి రోజుల తరబడి జరిగిన మేదోమధనంలో సలహాదారుగా విద్యాసాగర్ రావుగారు క్రియాశీలంగా భాగస్వాములైనారు. ముఖ్యంగా కృష్ణా నీటిలో వాటా కోసం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ , సుప్రీం కోర్టులో కొనసాగుతున్న పోరాటంలో విద్యాసాగర్ రావు సూచనలు , సలహాల మేరకే అఫిడవిట్లు తయారయినాయి. విభజన చట్టం ద్వారా ఏర్పాటైన కృష్ణ నదీ యాజమాన్య బోర్డు సమావేశాల్లో విద్యాసాగర్ రావు సమర్థవంతంగా వాదనలు వినిపించేవారు. ఆయన వాదనల దాటికి తట్టుకోలేక , జవాబులు చెప్పలేక బోర్డులో ఆయన పాల్గోనడాన్నే ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు ప్రశ్నించేవారు. ఒక సమావేశంలో ఈ విధంగా ప్రశ్నించినప్పుడు వారితో ఈ సమావేశానికి నేను తమాషా చెయ్యడానికి రాలేదు. తెలంగాణా ప్రయోజనాలని రక్షించడానికి వచ్చాను అని ఆగ్రహం ప్రకటించినారు. విద్యాసాగర్ రావు కృష్ణా బోర్డు సమావేశాల్లో పాల్గొంటే తమ పప్పులు ఉడకవు అని భావించి కేంద్ర ప్రభుత్వం ద్వారా రాజకీయ పదవి నిర్వహిస్తున్న విద్యాసాగర్ రావు కృష్ణ బోర్డు సమావేశాల్లో పాల్గొనడానికి అర్హుడు కాదు అని తెలంగాణా ప్రభుత్వానికి లేఖ రాయించిన్రు. తనవల్ల ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తకూడదని భావించి తనే స్వచ్చందంగా తప్పుకున్నాడు. అయితే బోర్డు సమావేశాలు జరిగే ముందు తప్పనిసరిగా సమీక్ష జరిపి రాష్ట్ర ప్రతినిధులకు సూచనలు చేసేవారు. మన వాదనలు ఎట్లా ఉండాలో నిర్దేశించేవారు. అయితే ఒక విషయాన్ని చెప్పక తప్పదు. ఆయన కృష్ణా బోర్డులో ఆయన పాల్గోన్నంత కాలం బోర్డు నిర్ణయాలు సమతూకంతో ఉండేవి. ఆయన తప్పుకున్న తర్వాత పరిస్థితి అదుపు తప్పింది. బోర్డు నిర్ణయాల్లో సమతూకం తప్పింది.

ఆయన అనారోగ్యానికి గురి అయిన తర్వాత ఇటీవలే అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకు ఏర్పాటు అయిన బజాజ్ కమిటీ రెండు రాష్ట్రాల పర్యటనకు వచ్చింది. మొదటిరోజు హైదరాబాద్ లో తెలంగాణా ప్రతినిధులతో సమావేశం జరిగింది. రెండో రోజు అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులతో సమావేశమైనారు. మూడో రోజు రెండు రాష్ట్రాల సంయుక్త సమావేశం జరిగింది. తెలంగాణా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించింది విద్యాసాగర్ రావు గారే. సంయుక్త సమావేశంలో ఆంద్ర ప్రదేశ్ పట్టిసీమ నుంచి గోదావరి నీటిని కృష్ణా బేసిన్ కు తరలిస్తున్న నీటిలో తెలంగాణా వాటా ఏంటో తేల్చవలసిన అంశం తమ పరిధిలో లేదని బజాజ్ ప్రకటించినారు. ఇది మొదటి రోజు బజాజ్ కమిటీ వెల్లడించిన వైఖరికి పూర్తిగా భిన్నంగా ఉండడంతో విద్యాసాగర్ రావు ఆగ్రహంతో ఈ అంశం మీ పరిధిలో లేకపొతే ఈ సమావేశాల కోసం పర్యటన ఎందుకు జరుపుతున్నట్లు. మీ వైఖరి శోచనీయం మిస్టర్ బజాజ్ అని నిష్కర్షగా అన్నారు. ఇట్లా అవసరమయినప్పుడు తెలంగాణా ప్రయోజనాలను పరిరక్షించడానికి మర్యాదలను పక్కన పెట్టి మాట్లాడేవారు. ఇది ఆయన వ్యక్తిత్వంలో మరో పార్శ్వం.
సలహాదారుగా మంత్రి హరీష్ రావు గారు తాను వారం వారం క్రమం తప్పకుండా నిర్వహించే మిషన్ కాకతీయ వీడియో కాన్ఫరెన్స్ లకు , ప్రాజెక్టులపై నిర్వహించే సమీక్షా సమావేశాలకు , క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశాలకు తప్పనిసరిగా ఆహ్వానించేవారు. డిల్లీలో అంతర రాష్ట్ర సంబందిత అంశాలను పరిష్కరించే భాద్యతని మంత్రిగారు విద్యాసాగర్ రావు గారికే పురమాయించేవారు. దిల్లిలో కేంద్ర జలసంఘం అధికారులతో , కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ అధికారులతో తనకున్న పరిచయాలతో సమస్యలను పరిష్కరించడంలో విద్యాసాగర్ రావు గారు విశేషంగా కృషి చేసినారు. గత మూడు నాలుగు నెలలుగా ఆయన అనారోగ్యానికి గురి అయి భాద్యతలు సరిగా నిర్వహించలేని పరిస్థితిలో మంత్రి గారు అంతర్రాష్ట్ర సమస్యల విషయంలో ఆయన అవసరాన్ని చాలాసార్లు తలుచుకునేవారు.

సాహిత్య పిపాసి :
విద్యాసాగర్ రావు నీళ్ళు – నిజాలు రచయితగానే తెలంగాణా ఉద్యమ శ్రేణులకు తెలుసు. అయితే ఆయనలో ఉత్తమమైన సాహిత్య పిపాసి కూడా ఉన్నాడని అతి కొద్ది మంది సన్నిహితులకు మాత్రమె తెలుసు. తోలి నాళ్లలో ఆయన కవిత్వం కూడా రాసేవారు. ప్లస్ మైనస్ అనే కవిత్వ సంపుటాన్ని కూడా ప్రచురించినారు. మొన్న అంబర్ పేట స్మశాన వాటికలో వరవరరావు విద్యాసాగర్ రావు గారికి నివాళి ఆర్పించేందుకు వచ్చినప్పుడు విద్యాసాగర్ రావు తొలి కవిత ప్లస్ మైనస్ ని తానే సృజనలో అచ్చువేసినానని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఉద్యోగ రీత్యా దిల్లీలో ఆయన కవిత్వాన్ని వదిలి నాటకాలను రాయడం , వాటిని ప్రదర్శించడం , నాటకాలకు ప్రయోక్తగా వ్యవహరిస్తూ , రేడియో కార్యక్రమాలకు స్క్రిప్టులు రాస్తూ తన సాహిత్య దాహాన్ని తీర్చుకున్నారు. ఆయన రాసిన ఒక డజను నాటకాలను ప్రచురించి , ఒక మూడు రోజుల పాటు నాటకాలను ప్రదర్శిస్తే చూసి ఆనందించాలని ఆయన కోరుకున్నారు. తెలంగాణా థియేటర్ రీసర్చ్ వారితో ఆ ఏర్పాట్లు చేసుకొమ్మని పురమాయించినారు. వాటికి నిధులు తానూ సమకూరుస్తానని కూడా వారికి హామీ ఇచ్చినారు. ఆ సంస్థ ప్రతినిధి విజయ్ కుమార్ గారు ఆ పనిలో నిమగ్నమైనారు. ఈ లోపల ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో పుస్తకం పని చూస్తున్న బి నరసింగ రావు గారు నన్ను సంప్రతించమని సూచించినారు. విజయ కుమార్ గారు మే నెల రెండో వారంలో పుస్తకావిష్కరణ , నాటకాల ప్రదర్శనకు జరుగుతున్న ఏర్పాట్ల గురించి నాతొ చర్చించినారు. అప్పటికే ఆయన కాంటినెంటల్ హాస్పిటల్ లో స్పృహలో లేని స్థితిలో ఉన్నారు. నాటకాల ప్రదర్శన వాయిదా వేసి మొదట పుస్తకాన్ని ప్రచురించి ఆయన చేతిలో పెడదాము . ఆయన బాగై వస్తే ఆయన కోరుకున్నట్లు నాటకాలు కూడా ప్రదర్శిద్దామని వారికి సూచించినాను. చిక్కడపల్లిలో హిమాలయ గ్రాఫిక్స్ సూరి గారితో మాట్లాడి పుస్తక ప్రచురణకు ఏర్పాట్లు చేసినాను. పుస్తకం దాదాపు పూర్తి కావచ్చింది. అట్లనే ఆచార్య జయశంకర్ గారిని ఇంటర్వ్యు చేసి వొడవని ముచ్చట్లు వెలువరించిన కొంపెల్ల వెంకట్ గారు విద్యాసాగర్ రావుని కూడా ఇంటర్వ్యు చేసి ఉన్నారు. ఆ పుస్తకాన్ని కూడా త్వరగా తీసుకు రావాలని కోరినాను. ఆ పని కూడా ఆయన చేపట్టినారు. ఈ లోపల ఆయన మరణం. ఆయనకు ఈ రెండు పుస్తకాలు కానుకగా ఇద్దామని చేస్తున్న ప్రయత్నానికి విఘాతం కలిగింది. త్వరలోనే ఆ రెండు పుస్తకాలని తెలంగాణా ప్రజలకు అందిస్తాము.

ఘనమైన వీడ్కోలు :
విద్యాసాగర్ రావు మరణంపై రెండు ముచ్చట్లు. ఆయన చనిపోక ముందే కొన్ని టి వి చానెళ్ళు ఆయన మరణ వార్తని ప్రసారం చేయడంతో సోషల్ మీడియాలో నివాళి అర్పిస్తూ పోస్టింగులు వెల్లువెత్తినాయి. ఏంటో ప్రయత్నం చేస్తే గాని వాటిని ఆపివేయించలేకపోయినాము. ఆయన మరణాన్ని హాస్పిటల్ యాజమాన్యం ద్రువీకరించేదాకా మీడియా వారు సంయమనం పాటించాలని కోరినాము. ఇదే విషయాన్ని పాశమన్నతో ( పాశం యాదగిరి) చెప్పి వాపోయినప్పుడు ఆయన నన్ను ఊరడిస్తూ గతంలో ప్రముఖులకు జరిగిన సంగతులు చెప్పినాడు. ఫైజ్ ఆహమాద్ ఫైజ్ ప్రముఖ ఉర్దూ కవి. దేశ విభజన తర్వాత పాకిస్తాన్ లో ఉండిపొయినారు. పాకిస్తాన్ కమ్యునిస్తుపార్తీ సభ్యుడు కూడా . ఆయన తీవ్ర అనారోగ్యం పాలై హాస్పిటల్ లో చేరినప్పుడు ఆలిండియా రేడియో ఆయన మరణ వార్తని ప్రసారం చేసిందట. ప్రధానమంత్రి నెహ్రూ ఫైజ్ భార్యకు ఫోన్ చేసి తాన సంతాపాన్ని తెలియజేసినారట. ఆమె ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ ఆయన ఇంకా బతికే ఉన్నాడని చెప్పి ఫైజ్ తో ఫోన్లో మాట్లాడిన్చిందట. మొరార్జీ దేశాయి ప్రదానామంత్రిగా ఉన్నప్పుడు అనారోగ్యంతో ఉన్న జయప్రకాష్ నారాయణ్ మరణ వార్త వెలువడినప్పుడు భారత పార్లమెంటే ఆయనకు నివాళి అర్పించి ఆ తర్వాత తప్పయ్యిందని నాలిక కరుచుకున్నారట. మీడియా వారు విద్యాసాగర్ రావుని కూడా అటువంటి ప్రముఖుల జాబితాలో చేర్చినారు. అది అత్యుత్సాహమే అయినా ఆయనకు ఘనమైన నివాళి అర్పించేందుకు చేస్తున్న ప్రయత్నంగా మనం అర్థం చేసుకోవాలని అన్నారు. పాశమన్న చెప్పినట్లుగానే విద్యాసాగర్ రావు మరణం అనంతరం మీడియా అతనికి ఘనమైన వీడ్కోలు పలికింది.

కన్న ఊరిపై మమకారం :
విద్యాసాగర్ రావుగారికి ముగ్గురు సంతానం. ఇద్దరు కొడుకులు. ఒక కూతురు. చిన్న కొడుకు చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదంలో చనిపోయినాడు. ఆయన హబ్సిగూడ ఇంటికి నాగేష్ స్మృతి అని పేరు పెట్టుకున్నారు. పెద్ద కొడుకు రమణ కేంద్ర ప్రభుత్వ సంస్థ వాప్కోస్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. అల్లుడు రాజేశ్వర్ రావు గారు త్రిపుర క్యాడర్ కు చెందినా ఐఏఎస్ ఆఫీసర్. ప్రస్తుతం డిప్యుటేషన్ పై దిల్లీలో జాయింట్ సెక్రెటరీగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆయనే విద్యాసగార్ రావు కుటుంబానికి పెద్ద దిక్కు. విద్యాసాగర్ రావు రాష్ట్రానికి సేవలు అందించినా పుట్టిన ఊరు జాజిరెడ్డి గూడెంని మరువలేదు. తన ఊరుకి ఏమైనా చేయాలని తపన పడినారు. తమ పూర్వీకుల ఇంటిని కూల్చి ఆ జాగాని కళ్యాణ మండపం నిర్మాణం కోసం అప్పగించినారు. మంత్రి హారీష్ రావు గారి చేత శంఖు స్థాపన కూడా చేయించినారు. మంత్రి గారిని ఒప్పించి జాజిరెడ్డి గూడెం లో ఒక మార్కెట్ యార్డుని కూడా సాంక్షన్ చేయించినారు. అర్వపల్లిలో ఉన్న ప్రాచీన లక్ష్మి నరసింహస్వామీ దేవాలయ అభివృద్ధి కోసం స్వయంగా మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి , ఈటెల రాజేందర్ గార్లని కలిసి ఫైలును ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపినారు. ముఖ్యమంత్రి గారు ఆయన కోరికను మన్నించి ఒక కోటి రూపాయలు మంజూరు చేసినారు. జి ఓ వచ్చేనాటికి ఆయన స్పృహలో లేరు. వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు నేనే జి ఓ కాపీని ఆయన చేతిలో పెట్టి సార్ అర్వపల్లి జి ఓ కాపీ తెచ్చాను, నాటకాల పుస్తకం అచ్చయ్యింది, కళ్యాణ మంటపం పనులు ప్రారంభం అయినాయని చెవిలో గట్టిగా చెప్పినాను. ఆయన విన్నారో లేదో ఆయనకే ఎరుక.

తెలంగాణా తీర్చుకున్న ఋణం :
తెలంగాణా ప్రజలకు ఆయనకు పలికిన వీడ్కోలు అవ్యాజనీయం. మీడియా సహకారం అపూర్వం. ప్రభుత్వం ఆయనకు అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించడం ఆయనకు దక్కిన గొప్ప గౌరవం. ఒక సాగునీటి ప్రాజెక్టుకు విద్యాసాగర్ రావు గారి పేరు పెట్టాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం , ఆ నిర్ణయాన్ని మంత్రి హరీష్ రావు గారు మీడియా ముందు వెల్లడించడం తెలంగాణా సమాజానికి , తెలంగాణా ప్రభుత్వానికి ఆయన అందించిన నిస్వార్థ సేవలకు తెలంగాణా సమాజం తీర్చుకున్న రుణంగా భావించాలి.
****
శ్రీధర్ రావు దేశ్ పాండే
సాగునీటి శాఖా మంత్రి ఓ ఎస్ డి

Advertisements

కృష్ణ నది జలాల పంపిణీ బ్రిజేష్ ట్రిబ్యునల్ – ఆంధ్ర . తెలంగాణ రాష్ట్రాలకు ఏసిన కోత అసలు లెక్క.


కృష్ణ నది జలాల పంపిణీ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ – ఆంధ్ర . తెలంగాణ రాష్ట్రాలకు ఏసిన వాటు పరిణామం

1973~74 నుంచి 2007-2008 వరకు 25 ఏండ్లూ బ్రిజేష్ ట్రిబ్యూనల్ రిపోర్ట్ 399పేజీ లెక్క ప్రకారం

ఈ 25ఏండ్లల్ల ఆంధ్ర . తెలంగాణ రాష్ట్రాలకు కర్నాటక రాష్ట్రం నుంచి 3 ఏండ్లూ (1986-87,  2002-03, 2003-04) చుక్క కుడా రాలె ఇంకా 5 ఏండ్లూ ( వచ్చింది 258టిఎంసీ ల కంటే తక్కువే
అంటే బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇప్పుడు 258 టిఎంసీ లు మహారాష్ట్ర , కర్ణాటక రాష్ట్రాలకు ఎక్కువ ఇచ్చిన పరిస్తితి ఐతే
8 ఏండ్లూ( 1985-86, 1986-87, 1987-88, 1995-96,  2001-02, 2002-03, 2003-04,  2004-05)  అసలు నీళ్ళు రాకుండే !
ఇంకా 25ఏండ్లల్ల 8ఏండ్లల్ల ఆంధ్ర . తెలంగాణ రాష్ట్రాలకు మిగులు జలాల కథ దేవుడెరుగు అసలు 800టిఎంసీ లకే దిక్కు లేదు ఇంకా గీ బ్రిజేష్ ట్రిబ్యునల్ పెట్టిన 258 టిఎంసీ ల కోత ఉండుంటే ఉన్‌కో 5ఏండ్లూ అంటే మొత్తం 25ఏండ్లల్ల 13ఏండ్లు (1982-83, 1984-85, 1985-86, 1986-87, 1987-88,1992-93,1995-96,  1999-00,  2000-01,  2001-02, 2002-03, 2003-04,  2004-05) మిగులు జలాల లెక్కవెంకన్న కి ఎరుక  అసలు 800 టిఎంసిలకే తీవ్ర ఎసరు దీంట్ల 8 ఏండ్లూ అసలు పైనుంచి అచ్చుడు సున్నా మన వర్షం నీళ్లే దిక్కు ..

Andhra & Telangana must get KWDT II - Revisit
గిదీ ఆంధ్ర . తెలంగాణ రాష్ట్రాలకు బ్రిజేష్ ట్రిబ్యునల్ కృష్ణ నది జలాల పంపిణీ కోత అసలు లెక్క..
ఇగ మహారాష్ట్ర . కర్నాటక రాష్ట్రాలు ఎందుకు దొరికిన బెల్లం పంచుతై…

ఇన్ని రోజులు మిగులు జలాలు వాటిపై పూర్తి హక్కు అనే ఒక అర్ధ సత్యం తో పాలకులు ఎంచి ఎంచి తెచ్చి పెట్టిన కొరివి ..
రెండు రాష్ట్రాలు గతం లో చేసిన తప్పు ని తప్పుగా రెండు రాష్ట్ర ప్రబూత్వాలు అటు సుప్రీమ్ కోర్ట్ లోను ఇటు కేంద్రం లోను చెప్పి గత తప్పులని క్షమించి రెండు కొత్త రాష్ట్రాలుగా అప్పుడు ఒప్పుకొని స్కీమ్ బీ కి సుముఖత తెలిపి అన్ని రాస్త్రాలు అసలు జలాలు మిగులు జలాలు పంచుకునే విధానానికి అన్ని రాష్ట్రాలు చర్చ అవసరమని వీడుకోవడం తో కాస్త అసలు కు ఎసరు లేని పరిష్కారం వైపు అందరితో కలిసి సాడిస్తారని ఆశిద్దాం ..

ఈ వాస్తవాలు చూసైనా ఆంధ్ర రాష్ట్ర సోదరులు మిగులు జలాలు ఆంధ్ర హక్కు అనే అర్థ సత్యం మత్తు వదిలి అందరితో అసలైన మీగులైన పంచుకోవడమేమంచి అని గ్రహిస్తారని కుడా ఆశిస్తున్నా..

ఇప్పుడైన రెండు రాష్ట్రాల పత్రికలు న్యూస్ చ్యానెల్ లు అసలు విషయాలు రాయున్రి సెప్పున్రి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మేధావులు మరియు మీడియా అడగరెందుకు ఈ ప్రశ్నలు ?


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మేధావులు మరియు మీడియా అడగరెందుకు ఈ ప్రశ్నలు

  1.  ఐదు ఏళ్లు ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి జరిగే మెలెంత ?
  2. కృష్ణపట్నం విద్యుత్ కేంద్రం పై చేసిన ఖర్చెంత? ఇప్పుడు రెండు 800 MW ప్లాంట్ లు పూర్తి ఐనవా ? కాలేదా? ఆంధ్ర రాష్ట్రం ఎంత విద్యుత్ కొంటుంది ? కృష్ణపట్నం ఉండగా ఎందుకు కొంటుంది ? ఏంటి రాష్ట్రానికి జరుగుతున్న ప్రయోజనం ?
  3. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆదాయం లో విశాఖ వాటా ఎంత ? ప్రభుత్వం CM ఇప్పుడు అక్కడ ఎంత వ్యయం సమయం ఎస్తున్నారు ?
  4. హైదరాబాదు లో ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ కి ఉన్న పని ఎమి ఎంత మంది ఉన్నారు ?
  5. పట్టిసీమ లో ఎత్తిపోతల ఖర్చు చేసేకంటే , పోలవరం లోనే ఆ ఎత్తిపొతలు పెట్టి ఆంధ్ర రాష్ట్రం కాకుండా కేంద్రమే భరిస్తుంది కదా ?
  6.  పోలవరం 194టిఎంసీ లు నింపి ఎంతో అటవీ సంపద ఖనిజ వనరులు ఆంధ్ర గిరిజంావాసుల నివాసం ముంచి 75 టిఎంసీ లే గ్ర్యావిటీ ద్వారా వాడి అంత గోస కంటే 100టిఎంసి డ్యామ్ పెట్టి మొత్తం లిఫ్ట్ చేయడం ద్వారా ఎక్కువ నీరు ఎక్కువ రోజులు వాడడం వాస్తవం కాదా ?
  7.  పోలవరం ఎత్తు 10 మీటర్ లు తగ్గించి, ఒడిసా, చత్తీస్‌గడ్ , భద్రాచలం ముంపు లేకుండా బదులుగా టర్బైన్ లసంఖ్య పెంచి, సీలేరు పై ఇంకొన్ని జల  విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు వేసి ఎడమ కుడి కాలువలకి పంప్ లు పెట్టి అందరికి ఆమోదయోగ్యం నష్టం చాలా తగ్గించి వాడే నీరు మళ్లింపు కూడా పెంచుకునే మార్పు చేసి అతి తొందరగా పూర్తి ఎందుకు చేయొద్దు ?
  8. కృష్ణ డెల్టా కె గోదావరి నీరు ఎత్తి పోయడం తప్పనప్పుడు రాయలసీమ కి శ్రీశైలం నీరు అలాగే తెలంగాణ కూడా తన వాటా కృష్ణ గోదావరి నదుల పై ఎత్తిపోతలకేందుకు మద్దతు చెప్పకూడదు ?
  9.  తెలంగాణ తో ప్రతి విషయం కిరికిరి ఎందుకు , దాని వల్ల లాభం కంటే నష్టమే కాదా ?
  10.  గోదావరి పై మంచి ఇన్‌లాండ్ జల రావణ మార్గం కోసం పోలవరం మరియు పురాతన డవళేశ్వరం బ్యారేజి మరియు రేల్‌వేలైన్ ల మార్పు పై ఎందుకు కేంద్రానికి అభ్యర్తించోడు , దక్షిణ భారత ఒకేఒక  జీవ నది గోదావరి ఒక పెద్ద చౌక మరియు పర్యావరణ రక్షిత ఇన్‌లాండ్ జల రవాణా మార్గం చేస్తే సార్వతోముకాభివృద్దికి చేయూత కాదా ?

ప్రాణహిత పై రెండవ బ్యారేజి అవకాశము


గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి
శ్రీ  కె చంద్రశెకర్ రావు గారికి

నమస్కారములు
ఆర్య
ప్రాణహిత పై ఇప్పుడు మహారాష్ట్ర ప్రబుత్వము తో ముంపు తగ్గించు ప్రత్యామ్నయంలో బాగంగా
ముక్కేదిగూడెం వద్ద 140 మీటర్ ల రెండవ బ్యారేజి కి మహరాస్త్ర ఒప్పుకుంటే ఇప్పటి బ్యారేజి 150 మీటర్ లకు తగ్గించిన
మొత్తము అవసరమైన నీరు వాడడమే కాకుండా జల విద్యుత్ కనీసము 250 MW అదనంగా  ఉత్పత్తి అవుటండని నా అంచనా

 

Pranahita Lower Barrage at Mukkidigudem

మీరు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోగలరని మనవి

మీ అభిమాని తెలంగాణ శ్రేయోభిలాషి

వెంకట్ గాంధీ

“తెలంగాణ – KCR”


Jagan Rao
“తెలంగాణ – KCR”
*******************
నవీన దృక్పథంతో శాస్త్రీయ విధానం కలిగిన సంఘటిత ప్రజాశక్తి గా ఒక పార్టీ(TRS party-2001) ని స్థాపించి, , ఎట్లస్తది తెలంగాణ అన్న స్తితి నుంచి ఎందుకు రాదు తెలంగాణ అని స్రుష్టించిన వ్యక్తి, సుదూరం అనుకున్న తెలంగాణ స్వరాష్ట్ర సాధన లక్ష్యాన్ని సాకారం చేసిన వ్యక్తి మన KCR – కల్వకుంట్ల చంధ్రశేఖర్ రావు.

తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) పెట్టిన రోజే ఒక మాట చెప్పాడు. నేను, తెలంగాణ అంశం కోసం నా జీవితాన్ని పణం గా పెట్టి వచ్చాను. ఒకవేళ, తెలంగాణ అంశాన్ని నేను వదిలిపెడితే రాళ్ల తో కొట్టి చంపండి అని.

సమైఖ్యం లో తెలంగాణ అభివ్రుద్ది చెందదు అని తలచి, పదవులను త్యాగం చేసి, తాను మొక్క గా మొలచి, చెట్టై నిలిచి, వట వ్రుక్షం గా మారి, తెలంగాణ వెనకబడ్డ ప్రాంతం కాదు, వెనక పడేయబడ్డ ప్రాంతం. వివక్ష, నిర్లక్ష్యానికి గురి చేయబడిన ప్రాంతమని తను ఎరిగిన సత్యాన్ని, జగమెరిగేలా తెలియజేచి , తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, జాతీయ ఎజెండా గా మార్చిన యోధుడు మన KCR.

సంపన్న కుటుంబం లో పుట్టినా,తెలంగాణ కోసం తన ప్రాణాలను సైతం దారపోయటానికి సిద్దపడ్డ,బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం అను నిత్యం పాటు పడుతున్న, ముళ్ళు, రాళ్ళు అవాంతరాలు ఎన్ని ఎదురైనా చెక్కు చెదరని ఉక్కు సంకల్పంతో ముందు ముందు కు నడుస్తూ, 4 కోట్ల తెలంగాణ ప్రజలను ముందుకు నడిపించిన నాయకుడు, నిజమైన ప్రజాఉద్యమనేత ఈ KCR ని Martin Luther king of India అనొచ్చు.

ఇతరులు ఎన్ని కుట్రలు పన్నినా, గిట్టని వాళ్ళు ఎన్ని విషపు ప్రచారాలు చేసినా, ఆటు పోట్లకు బయపడక, ఎదురుదెబ్బలకు క్రుంగిపోక తన Vision, Clarity, Commitment తో, Determination and Sincerity తో, తెరవెనకైనా, ముందైనా అభివ్రుద్ది , తెలంగాణ వాదమే 4 కోట్ల తెలంగాణ ప్రజల వేదం గా మార్చాడు.

KCR తయారు చేసినంత ఎక్కువ మంది నిజమైన నాయకులను, ఉద్యమ కారులను సమకాలీన ప్రపంచంలో మరెవ్వరూ చేయలేదు. Contemporary Indian Politics & Politicians లో మాత్రం KCR కంటే True & Perfect Leader ఎవ్వరూ లేరు. ఇవి తెలంగాణా ఉద్యమం చెప్పిన నిజాలు. అస్తమానము KCR ను తెలంగాణా ఉద్యమాన్ని విమర్శించే వాళ్ళు తమ అహాన్ని, అహంకారాన్ని, రాజకీయ అవసరాలను పక్కన పెట్టి, కళ్ళు తెరిచి, మనసుతో చదవాల్సిన చరిత్ర.

జై KCR……జై తెలంగాణ……జై జై తెలంగాణ !!!

********
I see #KCR Combines the Good of Mahatma, Martin Luther King and Mandela ..
God Bless Him to Serve people of Telangana and inturn India, Let
History Judge Him

సిమాంధ్ర తమ్ముల్ల కొసం


By Swamy Vivek Patel Akula

మోసం జరిగిందని నేను మొత్తుకున్నప్పుడు
ఆత్మగౌరవం కోసం నేను ఆరాటపడ్డప్పుడు

ఖాకీ తుపాకీల రబ్బరు బుల్లెట్లు నాకు తగిలినప్పుడు
కరకు లాఠీలు నా వంటి మీద నాట్యమాడినప్పుడు
ఇనుపకంచెలు వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు
హక్కుల గురించి నిలదీస్తున్న నా తమ్మున్ని
అన్యాయంగా నీవు ఎందుకు కొట్టావు ? అని అన్నగా తమ్ముడుగా నీవు ప్రశ్నించి ఉంటే
కలిసి ఉండాలన్న నీ కాంక్ష ఈ రోజు నాకు నచ్చేది

స్వరాష్ట్రం కోసం పోరాడుతున్న నా మీద సర్కారు కత్తి కట్టినపుడు
చేతికొచ్చిన పిల్లలు ఆత్మబలిదానాలతో పిట్టల్లా రాలుతున్నప్పుడు
విశ్వవిద్యాలయాలు పోలీసుల లాఠీఛార్జీలకు, తుపాకీ కాల్పులకు,
భాష్పవాయువు ప్రయోగాలకు కేంద్రాలుగా మారినప్పుడు
అయ్యోపాపం అని నీవు ఒక్కనాడు ఓదార్చిన
తోటి తెలుగువాడన్న చలనం నా మనసులో కలిగిఉండేది

వచ్చిన తెలంగాణను అడ్డుకున్న సీమాంధ్ర దొరబాబులు
ఎక్కడి తెలంగాణ అన్న సీమాంధ్ర పెట్టుబడి డాబులు
అడుగడుగునా అవహేళనలు, అమరుల ఆత్మబలిదానాలు
మా కళ్ల ముందు ఇంకా మెదులుతున్నాయి

దశాబ్దాల మా కల తీరేవేళ దగ్గరికొచ్చాక
నోటి కూడు లాగేసుకుందామనే నీ ఆలోచనే
మాకు వెగటు పుట్టిస్తోంది ..
పెట్టుబడిదారులంతా సమైక్య ఉద్యమాన్ని పుట్టిలా కమ్మేశారు
ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంబాలయిన పత్రికలు
సీమాంధ్రలోని లేని భావనను తట్టిలేపుతున్నాయి

ఇప్పటికీ చెబుతున్నాం
బతకనీకె వచ్చినోళ్లతో మాకు బాధలేదు
దోచుకునెటోనితోనే పోరాటమంతా
తెలంగాణ మా జన్మ హక్కు
దాన్ని ఎవరూ ఆపలేరు..లాక్కుపోలేరు

జై తెలంగాణ !! జై జై తెలంగాణ !!!

ఇంతా చేసి ఎలా కలిసి ఉంటారు


-ఇంత అన్యాయం ఉంటదా?
-విడిపోతామంటే ఈ వింతలేమిటి?
-సీమాంధ్ర నేతల తీరుకు ఛీ కొడుతున్న తెలంగాణ ప్రజలు
-ఇవేం టీవీలు, ఇవేం కతలని ముక్కునవేలేసుకుంటున్నరు
-గంటకో మాట మారుస్తారా?.. ఇంతా చేసి ఎలా కలిసి ఉంటారు
-పెడితె పెండ్లి లేకుంటె సావు అంటరా అని ప్రశ్నలు

ఇంత అన్యాయమా?…అరిగోస పోసుకుంటున్నరు కద!… ఇవాళ ఏ తెలంగాణవాసిని కదిలించినా చెప్పేమాట ఇది. పట్టణాలు, గ్రామాలు తేడా లేదు. పురుషులు, మహిళలన్న బేధం లేదు. పేద, ధనిక వ్యత్యాసం లేదు. అందరిదీ ఇదే మాట. భాషలో తేడా ఉండొచ్చు. వ్యక్తీ కరణలో తేడా ఉండొచ్చు. గుండెమంటలో మాత్రం ఇసుమంత ఫరక్ లేదు. ఇవాళ అంతా తెలం గాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర రాజకీయ నాయకులు చేస్తున్న సర్కస్ ఫీట్ల గురించి మాట్లా డుతున్నారు. ఎవరూ ఎవరినీ ఎడ్యుకేట్ చేసే పనిలేదు. అందరికీ అన్నీ తెలిసిపోయి నయ్. నాలుకలు ఎన్ని మడతలు పెడుతున్నరో చూస్తున్నరు. నాటకాలు ఎట్లా ఆడుతున్నరో చూస్తున్నరు. ఎవరెంత విషం.. ఎట్ల చిమ్ముతున్నరో చూస్తున్నరు. అరవై ఏండ్ల తర్వాత కేంద్రం గుండె కరిగి తెలంగాణ ఇస్తనంటే ఎన్ని తిప్పలు పెడుతున్నరో చూస్తున్నరు. ఇంతచేసి ఎట్ల కలిసుంటమను కుంటున్నరు, ఏం ముఖం పెట్టుకొని కలిసుంటరు.. అనేది అందరినోట వినిపించే ప్రశ్న.

హైదరాబాద్, డిసెంబర్ 11: రాష్ట్రంలో, కేంద్రంలో జరుగుతున్న పరిణామాలు తెలంగాణ ప్రజలను తీవ్రంగా కలిచివేస్తున్నాయి. రాజకీయ పార్టీల నేతలు అన్ని విలువలు వదిలేసి విషం చిమ్ముతున్న తీరును ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారు. అరవై ఏళ్లు భరించి, భరించి విముక్తి కావాలని కోరుతుంటే తెలంగాణ గొంతును మందబలంతో తొక్కేయాలనుకుంటున్న సీమాంవూధుల తీరుపై మండిపడుతున్నారు. రోజుకో కొత్తకుట్రకు తెరతీస్తున్న వైనం పై నిప్పులు చిమ్ముతున్నారు. ‘మనుషులు ఇంత అన్యాయంగా ఉంటారా’ అని విస్తుపోతున్నారు. పెడితే పెండ్లి అంటరు లేకుంటె సావు అంటరా అని మండిపోతున్నరు. నిన్న మొన్నటిదాకా ఎవరేం మాటలు చెప్పిందీ తలుచుకుని పళ్లునూరుతున్నారు. ఎన్ని ముచ్చట్లు చెప్పారు. ఇవాళ ఏం చేస్తున్నారు అని మండిపడుతున్నారు. నోటికొచ్చిన అబద్ధాలన్నీ ఆడుతున్న తీరునుచూసి నోరు వెళ్లబెడుతున్నరు.

imageతెలంగాణ ప్రజలు 1956లోనే సమైక్య రాష్ట్రం మాకొద్దన్నప్పుడు వీళ్లను రమ్మన్నదెవరని ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలోని పెద్దలను మేనేజ్ చేసి సీమాంవూధులు తెలంగాణలో చొరబడ్డారని, అన్నదమ్ములం అంటూ ‘తెలంగాణ అభివృద్ధి మా ప్రత్యేక బాధ్యత’ అంటూ కల్లబొల్లి మాటలు చెప్పారని అంటున్నారు. ఒప్పందాలు పోయినయ్. మా ఉద్యోగాలు పోయినయ్. నీళ్లు పోయినయ్..నిధులన్నీ పోయినయ్. 1969లో మాకు వద్దే వద్దు అని మళ్లీ అన్నాం… వందల మందిని కాల్చిపారేశారని అంటున్నారు. మలిదశ ఉద్యమం కీలెరిగి వాత పెట్టే పద్ధతిలో వచ్చి పునాదులకు ఎసరు వస్తే మాటలు మార్చారని గుడ్లురుముతు న్నరు. ఎన్నో ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు గుండెచీల్చి అభీష్టాన్ని వెల్లడించారని గుర్తు చేశారు. దీక్షలతో ప్రాణాలు ఫణంగా పెడితే కేంద్రం కదిలి తెలంగాణ ప్రకటించిందని నరంలేని నాలుకలను ఇష్టం వచ్చినట్టు మార్చారని దుయ్యబడుతున్నారు.

చర్చలు జరపలేదా?
అప్పటినుంచి కేంద్రం ఎన్నోసార్లు చర్చలు జరిపిందని, నాయకులందరినీ పిలిచి మాట్లాడిందని గుర్తు తెచ్చుకుంటున్నారు. ఇవాళ సీమాంవూధులు ఎవరితోనూ చర్చించలేదనడం పచ్చి అబద్ధమని బల్లగుద్ది చెబుతున్నారు. 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటన 23నాడు ఆపివేసిన తర్వాత కేంద్రం 2010 జనవరి 5న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అభివూపాయాలు అడిగిందన్న విషయం గుర్తు చేస్తున్నారు. ఆనాటి సమావేశానికి అన్ని పార్టీల వారు హాజరు కాలేదా? అభివూపాయాలు చెప్పలేదా? అని ప్రశ్నిస్తున్నారు. ఆ తర్వాతే కేంద్రం శ్రీకృష్ణ కమిటీ వేసిందని వారు చెబుతున్నారు. ఆ కమిటీ ఏడాదిపాటు రాష్ట్రంలో అనేక ప్రాంతాలు తిరిగిందని అందరినీ కలిసి అభివూపాయాలు తీసుకుందని వారంటున్నారు. ఆ కమిటీ నివేదికలో అనేక విషయాలు చెప్పిందని అందులో తెలంగాణ ఏర్పాటు కూడా ఉందని గుర్తు చేస్తున్నారు. అదీ గడిచిన తర్వాత 2012 డిసెంబర్ నెలలో షిండే మరో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేరని దానికి కూడా పార్టీలన్నీ హాజరై తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చాయని గుర్తుచేస్తున్నరు. దాని పర్యవసానంగానే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంవూతిని, ఉప ముఖ్యమంవూతిని పిలిచారని, వారు తమ తమ ప్రజెం ఇచ్చారని చెబుతున్నారు.

అక్కడ గంటల తరబడి మాట్లాడిన వాళ్లు ఇవాళ ఎవరితో చర్చించారని ప్రశ్నించడం వింతగా ఉందని అంటున్నారు. ఇంత జరిగిన తర్వాత తెలంగాణకు నిర్ణయం తీసుకున్నా మళ్లీ పార్టీ పరంగా ఆంటోనీ కమిటీని ఏర్పాటు చేసి అభివూపాయాలు వివరంగా తెలసుకున్నారని, అదీ చాలదని కేంద్రమంవూతుల బృందం కూడా చర్చలు జరిపిందని చెబుతున్నారు. ఇంకా ఏం జరపాలి? ఏం చేయాలి? అని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో అయితే వీరప్ప మొయిలీ దగ్గరినుంచి ఆజాద్, దిగ్విజయ్ ఇన్‌చార్జిలుగా ఉన్న సమయాల్లో ఎన్ని డజన్లసార్లు ఎన్ని సీమాంధ్ర కాంగ్రెస్‌నాయకుల బృందాలు పర్యటనలు జరిపారో గుర్తు చేసుకోవాలని వారంటున్నారు. ఢిల్లీ ఏపీభవన్‌లో బస చేసిన వారి లిస్టులు చూస్తే అసలు విషయాలు బయటపడతాయంటున్నారు. ఢిల్లీ టూర్లు చేసి ప్రణబ్‌నుంచి ఆంటోనీ, ఆజాద్, అహ్మద్ పటేల్ , వీరప్ప మొయిలీలతో ఎన్ని వందల గంటలు రాష్ట్ర విషయం చర్చ జరిపారో గుర్తు చేసుకోవాలని అంటున్నారు. 2004లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నప్పుడు వీళ్లంతా ఏ బొంతకప్పుకుని పడుకున్నరని అడుగుతున్నారు. కరీంనగర్‌లో 2004లో భువనగిరిలో 2009లో సోనియాగాంధీ తెలంగాణ ఇస్తామన చెప్పినప్పుడు ఏంచేశారని అడుగుతున్నారు.

ఇంతా చేసి ఎలా కలిసుంటారు?
తెలంగాణ మీద రాజకీయవాదుల కుట్రలన్నీ గమనిస్తున్నామని ప్రజలు హెచ్చరిస్తున్నారు. వాళ్లు మాట మార్చడం చూశాం. తెలంగాణ ఇస్తానన్నందుకు సొంతపార్టీని కూల్చే యత్నాలు చూస్తున్నాం. ఇక వాడి తల్లో పుట్టినోడన్నట్టు వీళ్లకంటే ఎక్కువ ఎగిగిరి పడ్డ సీమాంధ్ర ఉద్యోగుల తీరును చూస్తున్నాం! ఆత్మహత్యలుండవు…హత్యలే అనే దురహంకార వాదనలు చూశాం. తెలంగాణ నడిబొడ్డున నిలబడి మీ బతుకు అంటున్న మహా తల్లులను చూస్తున్నాం. హైదరాబాద్ మా రక్తం..మా చీము.. మా పిండాకూడు అంటున్న మేధావులను చూస్తున్నాం. పాఠశాలల్లో నోటుబుక్కుల్లో తెలంగాణ అని రాసుకున్నందుకు చితకబాదిన స్కూలు యాజమాన్యాలను చూస్తున్నాం.. జబ్బలు చరుస్తున్న లాయర్లను హైకోర్టులో చూస్తున్నాం.. ఇంటి పక్కోడి వంకరమాటలు చూస్తున్నాం. ఇడ్లీ బండోడి బూతు మాటలు విం టున్నాం. అసెంబ్లీని ముట్టడిస్తామంటాడో సీమాంధ్ర ఉద్యోగనాయకుడు. దిగ్విజయ్ రావొద్దంటాడొకడు. ఆత్మాహుతి దళాలమవుతామంటాడొకడు.. గంటకో పిటిషన్ కోర్టులో పెడతాడో మరొకడు!

ఇవేం టీవీలు..ఇవేం కతలు!
ముఖ్యంగా మీడియా తీరుపై తెలంగాణ ప్రజలు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. వెయ్యిమంది పిల్లలు చచ్చిపోయినా ఎలాంటి జంకుగొంకూ లేకుండా వాళ్లు ప్రసారం చేస్తున్న కథనాలే పిల్లల ప్రాణాలు తీస్తున్నాయంటున్నారు. గంటకో కథ, నిమిషానికో వివాదం, రోజుకో నాటకం ఆడుతున్నాయంటున్నారు. తెలంగాణ నాయకులు మాట్లాడే ప్రతిమాటను వక్రీకరిస్తూ రాక్షసానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న చెప్పిన మాట ఇవాళ ఉండదు ఇపుడు చెప్పిన మాట గంట తర్వాత ఉండదని గుర్తుచేస్తున్నారు. షిండే విదర్భవాడని, తెలంగాణ ఇవ్వడని ఓ టీవీలో ప్రసారం చేశారు. ఇంతకీ ఆయన మరాట్వాడావాడు.

ఆయనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఇపుడా టీవీ ముఖం ఎక్కడ పెట్టుకుంటుందని ప్రశ్నిస్తున్నారు. శ్రీకృష్ణకమిటీ నివేదిక ఇచ్చేముం దు రోజుకో ముచ్చట. హైదరాబాద్ యూటీ అని ఓసారి సీమాంవూధకే అని ఓసారి తెలంగాణకు వేరే రాజధాని అని ఇంకోసారి ఇలా నోటికొచ్చిన ప్రచారాలు చేశాయి. ఇక తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొత్త పార్టీ పెడుతున్నారని కొన్ని రోజులు ఊదరగొట్టారు. ఇక ఉద్యమపార్టీ మీద నిందలు వేయడానికి, వెంటాడి వేధించడానికి వాళ్లకు రోజుకు 24 గంటలు కూడా సరిపోలేదు. వార్డు స్థాయికూడా లేని ఏబ్రాసి నాయకుడెవరో పార్టీ వీడితే తాళం వేసుకుంటారనే లెవల్లో ప్రచారాలు. ఎవడన్నా ఓ మాట వ్యతిరేకంగా మాట్లాడితే వాడితో గంటలకొద్దీ ఇంటర్వ్యూలు..అదే తెలుగుదేశం కీలకనేత బయటికి పోతే రాజకీయభిక్ష పెట్టిన పార్టీకి వెన్నుపోటా అనే వాదనలు!! పదవుల కోసం.. పైసల కోసం అనే బురదలు ప్రసారం చేసేవని గుర్తు చేస్తున్నారు. ఇక కేంద్రం తెలంగాణ ఇస్తే వీళ్ల ఆస్తులనో ఆలుబిడ్డలనో లాగేసుకున్నట్టు లబలబలాడడమేమిటని నిలదీస్తున్నారు. ట్యాంకుబండ్ మీద విగ్రహాలు కూలితే ఉన్మాదం అనడానికి తెగించిన టీవీలు… సీమాంవూధలో జాతినేతల విగ్రహాలు ఉరితాళ్లు పెట్టి మరీ లాగేస్తే కూల్చేస్తే ఎందుకు పట్టించుకోలేదని ఇవాళ తెలంగాణలో పెద్దగా చదువులేని అతిసామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు..ఏం చెబుతారు??

కూడని పొత్తుల్లేవ్..రాని ప్రకటనల్లేవ్
-9-12-2009: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం ప్రకటన.
-23-12-09: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం యూటర్న్. రాష్ట్రంలోని అన్ని పార్టీలతో, సంబంధిత వర్గాలతో చర్చలు జరుపుతామని ప్రకటన.
-30-12-09: అఖిలపక్షానికి హాజరు కావాల్సిందిగా రాష్ట్రంలోని ఎనిమిది పార్టీలకు కేంద్ర హోంశాఖ పిలుపు.
-5-1-2010: ఢిల్లీలో జరిగిన మొదటి అఖిలపక్ష సమావేశం.
-28-1-10: రాష్ట్ర పరిస్థితుల అధ్యయనానికి కమిటీని నియమిస్తున్నట్లు కేంద్రం ప్రకటన.
-3-2-10: రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై జస్టిస్ శ్రీకృష్ణ సారథ్యంలో సంప్రదింపుల కమిటీ ఏర్పాటు.
– 4-3-10: రాష్ట్రానికి శ్రీకృష్ణ కమిటీ రాక. అన్ని పార్టీల అధినేతలతో సమావేశం.
-6-1-2011: శ్రీకృష్ణ కమిటీ నివేదిక వెల్లడి.
-5-12-2012: డిసెంబర్ 28న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంశాఖ ప్రకటన.
-28-12-12: కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన 8 పార్టీలతో అఖిలపక్ష భేటీ. తెలంగాణ సమస్యను నెలలోగా పరిష్కరిస్తామని షిండే ప్రకటన.
-1-7-2013: తెలంగాణ అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం త్వరలో నిర్ణయం వెల్లడిస్తుందని దిగ్విజయ్‌సింగ్ ప్రకటన.
-9-7-13: ఢిల్లీలో జూలై 12న పార్టీ కోర్ కమిటీ సమావేశానికి రావాల్సిందిగా సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షునికి అధిష్ఠానం పిలుపు.
-12-7-13: కోర్ కమిటీ సమావేశం అనంతరం తెలంగాణ అంశంపై సంప్రదింపుల ప్రక్రియ ముగిసింది. దీనిపై సీడబ్ల్యూసీ మీటింగ్‌లో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని దిగ్విజయసింగ్ ప్రకటన.
-26-7-13: కోర్ కమిటీ సమావేశం అనంతరం తెలంగాణ అంశంపై సంప్రదింపుల ప్రక్రియ ముగిసింది. కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం నిర్ణయం కోసం వేచి చూద్దామని దిగ్విజయ్‌సింగ్ ప్రకటన.
-28-7-13: జూలై 30వ తేదిన యూపీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం,సీడబ్ల్యూసీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయం.
-30-7-13: పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీడబ్ల్యూసీ తీర్మానం. పార్టీ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని దిగ్విజయ్‌సింగ్, అజయ్‌మాకెన్ ప్రకటన.
-6-8-13: నలుగురు సభ్యులతో కూడిన ఆంటోనీ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటన.
-7-8-13: ఆంటోనీ కమిటీ ఏర్పాటు.
-3-10-13: తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ అంగీకారం.
-11-10-13: తెలంగాణపై కేంద్రం ఏర్పాటు చేసిన జీవోఎం మొదటి సమావేశం.
-31-10-13: అఖిలపక్షానికి హాజరు కావాల్సిందిగా ఎనిమిది పార్టీలకు కేంద్ర హోంశాఖ లేఖలు.
-12, 13-11-13: రాజకీయ పార్టీలతో ముగిసిన అఖిలపక్ష సమావేశాలు. l 5-12-13: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదా బిల్లును ఆమోదించిన కేంద్ర కేబినెట్.

“ఇప్పుడు ఒకటే ప్రశ్న! ఇన్ని కుట్రలు చేసి..ఇంత విషం చిమ్మి..ఇన్ని మాటలు వదిలేసుకుని.. ఇక్కడి ప్రజల మనసు విరిచేసి ఇంకా….ఎలా కలిసి ఉంటారు. ఏం ముఖం పెట్టుకుని ఉంటారు. అన్నీ మరిచిపోయి మీతో కలిసి ఉండేదెలా? నాలుగున్నర కోట్ల గుండెల లోతుల్లోంచి పెల్లుబుకుతున్న ప్రశ్న! మీ దగ్గర జవాబుందా?”

Source: