“రామరాజు విద్యాసాగర్ రావు” నడిచే జల విజ్ఞాన గని


ప్రభుత్వానికి సాగునీటి సలహాదారు శ్రీ రామరాజు విద్యాసాగర్ రావు గారు మన మధ్య లేకపోవడం తెలంగాణా సమాజానికి తీరని లోటే గాక నాకు వ్యక్తిగతంగా కూడా పూడ్చలేని ఖాళీ. 2001 లో కె సి ఆర్ గారు తెలంగాణా రాష్ట్ర సమితిని ఈర్పాటు చేసినప్పటి నుండి ఆయనతో సన్నిహిత, వ్యక్తిగత సంబంధం ఏర్పడింది. ఆయన నిరాడంబర జీవిత శైలి వలన వయసుతో, హోదాతో నిమిత్తం లేకుండా ఎవరికైనా దగ్గరవుతారు. కె సి ఆర్ పక్కన కూర్చొని సాగునీటిపై జరిపే చర్చలని నేను కూడా శ్రద్దగా వినేవాడిని. తీరిక లేని ఉద్యమ కార్యాచరణ వలన ఆయన వ్యాసాలని క్రమం తప్పకుండా చదవలేకపోయినా కంట పడినప్పుడు అది ముఖ్యమైన వ్యాసమని తోచినప్పుడు దాచుకొని తీరిక దొరికినప్పుడు చవివేవాడిని. టి ఆర్ ఎస్ కార్యకర్తలకు శిక్షణా శిభిరాలు నిర్వహించినప్పుడు జల పాఠాలు చెప్పేది విద్యాసాగర్ రావు గారే. జటిలమైన సాంకేతక అంశాలని అరటి పాండు వొలిచి పెట్టినట్టు చెప్పే ఆయన పద్దతి వలన సాగునీటి సంగతులు, టి ఎం సిలు, క్యూసెక్కుల లెక్కలు తెలిసినవి. కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణాకు న్యాయంగా దక్కవలసిన్ వాటాలపై, గోదావరి, కృష్ణా ట్రిబ్యునల్ తీర్పులపై ఆయన చెప్పిన పాఠాల వలన స్పష్టత వచ్చింది. అంతర్రాష్ట్ర సమస్యలపై ఆయనకున్న అవగాహన మరెవరికీ లేదు. ప్రాజెక్టుల స్థితిగతులపై ఎంతో కొంత తెలిసిన వారు ఉన్నప్పటికీ అంతర్రాష్ట్ర సమస్యలపై, గోదావరి, కృష్ణా ట్రిబ్యునల్లపై విద్యాసాగర్ రావు గారు మాత్రమే సాధికారికంగా వివరించేవారు. పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో సాగునీటి రంగంపై విద్యాసాగర్ రావుగారికే మాట్లాడే అవకాశం ఇచ్చేది కె సి ఆర్ గారు. ఆయన మాట్లాడితేనే ఆ అంశానికి సాధికారత వస్తుందని ఆయన నమ్మకం. విషయంలోని అంతస్సారాన్ని పసిగట్టడంలోనే ఆయన నైపుణ్యం కనిపిస్తుంది. ఉదాహరణకు శ్రీశైలం జలాశయం కనీస నీటి మట్టాన్ని 834 అడుగుల నుంచి 854 పెంచడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యం ఏమై ఉంటుదో, అకస్మాత్తుగా ఎటువంటి సర్వేలు, డి పిఆర్ లు లేకుండానే 165 టి ఎం సి ల గోదావరి నీటిని ఎత్తి పోసే దుమ్ముగూడెం నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ పథకాన్ని ఎందుకు చేపట్టినారో, ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా పోలవరం ప్రాజెక్టుని ఎందుకు చేపట్టిందో .. అంతస్సారాన్ని ఆయన మాత్రమే వివరించగలిగినాడు. జలయజ్ఞం లక్ష్యం కృష్ణ నీళ్ళను రాయలసీమకు తరలించడం, గోదావరి నీటిని కృష్ణా ఆయకట్టుకు తరలించడం అన్న సారాంశాన్ని విప్పి చెప్పినవాడు విద్యాసాగర్ రావు. ఈ అవగాహన తర్వాత కాలంలో మంత్రిగా నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడింది. ఈ స్పష్టత ఉన్నది గనుకనే తెలంగాణా ఏర్పడగానే ప్రభుత్వం తీసుకున్న తక్షణ నిర్ణయాల్లో దుమ్ముగూడెం – నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టు రద్దు. పుష్కలంగా నీటి లభ్యత ఉన్న గోదావరి నీటిని తెలంగాణా అవసరాలకు వినియోగించుకోవడానికి రీ ఇంజనీరింగ్ చేపట్టడానికి విద్యాసాగర్ రావు గారు ఇచ్చిన అవగాహన ఎంతగానో ఉపయోగపడింది.

తెలంగాణా ఏర్పడగానే ముఖ్యమంత్రి కె సి ఆర్ గారు సాగునీటి సలహాదారుగా విద్యాసాగర్ రావు గారినే నియమించినారు. సాగునీటి శాఖలో ప్రతీ కార్యక్రమంలో సలహాదారుగా తనవంతు పాత్రని పోషించినాడు. ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ పై ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన కొన్ని వందల గంటల మేధోమధనంలో ఆయన క్రియాశీలంగా పాల్గొన్నాడు. అయన అపార అనుభవం ప్రాజెక్టుల రూపకల్పనలో కీలకమైనది . వారం వారం నిర్వహించే మిషన్ కాకతీయ విడియో కాన్ఫరెన్స్ లకు , ప్రాజెక్టుల సమీక్షా సమావేశాలకు , క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశాలకు ఆయనని తప్పనిసరిగా ఆహ్వానించేవాడిని. సాధ్యం అయినపుడల్లా పాల్గొనేవాడు. డిల్లీలో కేంద్ర జల సంఘం, కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ అధికారులతో ఆయనకున్న సంబందాలవలన అంతర్రాష్ట్ర సమస్యలని పరిష్కరించడానికి ఆయనకే పురమాయించేవాడిని. ఆయన భాద్యతగా ఆ పనులని నేరవేర్చేవారు. కృష్ణా జలాల్లో తెలంగాణా దక్కవలసిన న్యాయమైన వాటా కోసం కేంద్ర ప్రభుత్వంతో , బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో, సుప్రీం కోర్టులో తెలంగాణా వాదనలు రూపొందించడంలో ఆయన పాత్ర కీలకమైనది. అఫిడవిట్లు ఆయన ఆమోదించిన తర్వాతనే వాటిని సమర్పించడం జరిగేది. ఇప్పుడు అవన్నీ కీలకమైన దశకు చేరుకున్నాయి. ఈ సమయంలో ఆయన లేకపోవడం పెద్ద లోటుగానే భావిస్తున్నాను. ఇక మహారాష్ట్రతో గోదావరిపై అంతరార్రాష్ట్ర ఒప్పందాలు కుదుర్చుకునే ప్రతీ సందర్భంలో కె సి ఆర్ వెన్నంటి ఉండి తనవంతు సహకారాన్ని అందించినాడు.

ప్రభుత్వ సలహాదారు పదవి నిర్వహిస్తున్నా ఆయన సాదాసీదా జీవితం గడిపినాడు. అయన పదవిలో ఉండగా నా సహాయం అడగినవి కూడా తన వ్యక్తిగతమైనవి కావు. దిల్లికి రాజైనా తల్లికి కొడుకే అన్న సామెత మనదరికీ ఎరుకే. విద్యాసాగర్ రావు గారు తన కన్న ఊరు జాజిరెడ్డిగూడెంని మరువలేదు. తన ఊరికి ఏదైనా చెయ్యాలని తపనపడినాడు. ఆ ఊరి చెరువులు నింపి శాశ్విత వ్యవస్థ ఏర్పాటుకావాలని కోరుకున్నారు. జాజిరెడ్డి గూడెంలో ఒక మార్కెట్ యార్డుని సాంక్షన్ చేయ్యమని అడిగినాడు. ఊరికి ఒక కళ్యాణ మంటపం కావాలని తపనపడినాడు. అందుకు తమ పూర్వీకుల ఇంటి జాగాని విరాళంగా ఇచ్చి నా చేతనే శంఖు స్థాపన చేయించినాడు. అయన కోరినట్లు చెరువులని నింపడానికి ఎస్ ఆర్ ఎస్ పి డిస్త్రిబ్యుటరీ నుంచి ఒక తూముని ఏర్పాటు చెయ్యమని అధికారులని ఆదేశించినాను. జాజిరెడ్డి గూడెంలో మార్కెట్ యార్డుని సాంక్షన్ చేసినాను. కళ్యాణ మంటపం పనులని త్వరలోనే ప్రారంభింపజేసి ఆయన మొదటి వర్దంతి నాటికి ప్రారంభానికి తయారు చేస్తాం. అర్వపల్లిలో ఉన్న ప్రాచీన లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయ పునరుద్దరణ కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కోటి రూపాయలను ఇటీవలే సాంక్షన్ చేసినారు. జాజిరెడ్డి గూడెంలో ఆయన అనుకున్న పనులని పూర్తీ చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది.

ప్రభుత్వం ఆయన్ని కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలని చేసింది. మా ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. ప్రొ. జయశంకర్ లాగానే విద్యాసాగ రావుని కూడా క్యాన్సర్ భూతం మన నుంచి దూరం చేసింది. ఆయన మరణ ప్రకటన వెలువడిన వెంటనే ఆయన అంత్యక్రియలు అధికారికంగా జరపాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించినారు. ఒక సాగునీటి ప్రాజెక్టుకు విద్యాసాగర్ రావు గారి పేరు పెట్టడానికి కూడా ముఖ్యమంత్రి నిర్ణయించినారు. సాగునీటి శాఖ అధికారులతో సంప్రదించి త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తాము. విద్యాసాగర్ రావు కన్నా కలలని నెరవేర్చడానికి ప్రభుత్వం పోరాటం కొనసాగిస్తుంది. కృష్ణా , గోదావరి జలాల్లో తెలంగాణాకు న్యాయమైన వాటాను సాధిస్తాం. ప్రాజెక్టులని పూర్తి చేసి తెలంగాణని కోటి ఎకరాల మాగాణంగా మారుస్తాం. ఇదే మేము విద్యాసాగర్ రావు గారికి మేము అర్పించే ఘనమైన నివాళి.

– తన్నీరు హరీష్ రావు, సాగునీటి శాఖ మంత్రి

SRI THANNERU HARISH RAO

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s